TSPSC గ్రూప్ 1: ప్రణాళిక, పట్టుదల, స్థిరత్వం
తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ – 1 స్థాయి లో 503 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కొరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ పరీక్ష యొక్క ప్రిలిమ్స్ జూన్ లో మరొకసారి జరిగింది మరియు దీని మాస్టర్ కీ మరియు విద్యార్థుల OMR కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే విద్యార్థులకు ఒక అవగాహన వచ్చి ఉండాలి మెయిన్స్ కి అర్హత పొందుతున్నారో లేదో.ఒకవేళ ఇంచుమించు అర్హత సాధిస్తారు అనే ఆలోచన ఉన్నా మీ ప్రిపరేషన్ మొదలు పెట్టడం సరైన నిర్ణయం. ఎందుకంటే ఒకవేళ అర్హత పొందితే పరీక్ష దగ్గరైనప్పుడు ఇంకో 15 రోజులు ఉండి ఉంటే నేను ఇంకా మెరుగ్గా రాసేవాడిని/ రాసేదాన్ని అన్న భావన రాకూడదు. అలా అప్పుడు ఉంటే జీవితాంతం అవకాశం తప్పింది అన్న బాధ వెంటాడుతుంది. TSPSC సమాచారం ప్రకారం మెయిన్స్ అక్టోబర్ లో నిర్వహించడానికి సమాయత్తం అవుతుంది. ప్రిలిమ్స్ పరీక్ష అనేది ఆశావాహులలో సీరియస్ గా లేని వారిని తొలగించడానికి ఒక ఎలిమినేషన్ వంటిది. మెయిన్స్ పరీక్షలోనే అసలైన పోటీ ఉంటుంది. విద్యార్థి యొక్క విషయ పరిజ్ఞానం, స్పష్టత, అవగాహన మరియు సమయ నిర్వహణా సామర్థ్యం పూర్తిగా పరీక్షించబడుతుంది. అందువల్ల ఒక విద్యార్థి విజయవంతం అవ్వాలంటే సరైన ప్రణాళిక, స్థిరత్వంతో ఎక్కువ కాలం పాటు పట్టుదల తో కష్టపడే తత్వం కలిగి ఉండాలి
ప్రిపరేషన్ ప్రణాళిక- భగవద్గీత వంటిది
మెయిన్స్ పరీక్ష లో మొత్తం ఆరు పేపర్లు మరియు ఇంగ్లీష్ అర్హత పరీక్ష, ఒక్కో దానిలో మూడు సెక్షన్లు, ఒక్కో సెక్షన్లో అయిదు యూనిట్లు ఉంటాయి. ఇంత విస్తృత సిలబస్ పై పట్టు సాధించడానికి ప్రణాళిక లేకపోతే విద్యార్థి ప్రిపరేషన్ లో దారి తప్పే అవకాశం లేకపోతే చదవలేక నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది. ఈ ప్రణాళిక లో మూడు భాగాలు ఉంటాయి. అవి దీర్ఘ కాలిక ప్రణాళిక,మధ్యకాలిక ప్రణాళిక మరియు రోజు వారీ ప్రణాళిక. దీర్ఘ కాలిక ప్రణాళికలో ఏ సబ్జెక్టు ఎప్పుడు చదవాలి, ఏది ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి అనే దాని గురించి, మధ్యకాలికప్రణాళిక లో ఏ సబ్జెక్టు ఎన్ని రోజులు చదవాలి చదివే సమయం లో ఆ సబ్జెక్టు పరీక్షలు ఎప్పుడెప్పుడు రాయాలి, మళ్ళీ రివిజన్ సులువైన పద్దతి లో ఎలా చేయాలి అనేవి, రోజువారీ ప్రణాళిక లో ఎన్ని అంశాలు చదవాలి , ఎన్ని గంటలు మరియు ఎప్పుడెప్పుడు చదవాలి,జవాబు రాసే విధానం ఎలా మరియు ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి అనేవి కలిగి ఉండాలి. ప్రతీరోజూ ప్రణాళికాబద్ధం గా చదివితే గ్రూప్-I లో సునాయాసంగా విజయం సాధించవచ్చు.
స్థిరత్వం- విజయానికి మూలం
ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ కి 1:50 నిష్పత్తి లో 25,150 మంది ఎంపిక అవుతారు. కానీ ఈ 25.150 లో ఎంత మంది 503 లో ఉంటారు అనేది స్థిరత్వంగా ఎక్కువ కాలం పట్టుదలతో కష్టపడే తత్వం పైనే ఆధారపడి ఉంటుంది. చాలా మంది TSPSC పరీక్ష వాయిదా వేస్తుందనే దృక్పధంతో సమయాన్ని వృధా చేస్తున్నారు. పరీక్ష ఆ సమయానికి జరిగితే వీరు నష్టపోయే అవకాశం ఉంది అందువల్ల మీ ప్రిపరేషన్ ప్రణాళిక మరియు మీలో పట్టుదల సడలనివ్వద్దు. ఇలా చదివితే పరీక్ష అదే సమయానికి జరిగితే చక్కగా రాయచ్చు అదే వాయిదా పడితే ఇదే అవకాశం గా ఇంకో రెండూ సార్లు రివిజన్ చేసుకోవచ్చు మరియు మీ ర్యాంకు మెరుగుపరుచుకోవచ్చు. రాబోయే 5-6 నెలలు స్థిరత్వంతో ప్రిపరేషన్ చేసే సామర్థ్యం కలిగి ఉండే విధంగా మిమ్మల్ని మీరు సంసిద్ధులను చేసుకోండి. ఈ మధ్య లో ఇతర పరీక్షలు ఉన్నా మీరు ఏదో ఒక పరీక్ష పైనే మీ దృష్టి కేంద్రీకరించాలి. రెండు పడవల మీద ప్రయాణం అంతా శ్రేయస్కరం కాదు.
మెయిన్స్- చదివే విధానం
మెయిన్స్ లో మీ విషయావగాహనసు స్పష్టంగా తెలియజేయాలి. అందుకు ప్రతీ సబ్జెక్టు క్షుణ్ణంగా చదవడమే కాదు చదివింది పరీక్షలో వ్యక్తపరచాలి కూడా. దీని కోసం జవాబురాసే పద్ధతి ని పలు మార్లు ప్రాక్టీస్ చేయాలి. పరీక్ష లో మీకు 180నిమిషాలలో 15 ప్రశ్నలు రాయాలి. అందువల్ల ప్రతీ ప్రశ్నకు 12 నిమిషాల లెక్కన పూర్తిస్థాయిలో జవాబు రాయాలంటే విషయ పరిజ్ఞానం మరియు రాసేటప్పుడే అంశాలు క్రమానుసారంగా అమార్చుకోవడం రావాలి మరియు సాధన తోనే ఇది సాధ్యపడుతుంది. రోజు వారీ ప్రణాళిక లో వ్రాయడం సాధన కచ్చితంగా చేయాలి. రెండూ వారాలలో మీరు తేడా గమనిస్తారు. మరి రోజంతా అదే అంశం చదివితే ఇతర సబ్జెక్టు లకు సమయం సరిపోదు కదా అంటే రోజుని కూడా భాగాలుగా చేసుకుని రివిజన్ కొరకు 40% సమయం , కొత్త అంశం (తెలంగాణా ఉద్యమం వంటివి) 50% మరియు రైటింగ్ ప్రాక్టీస్ 10% లెక్క విభజించుకోవాలి. అందుకే ప్రణాళిక ఎంతో ముఖ్యం. ప్రతీ సబ్జెక్టు ఇప్పుడు మొదటి నుండి చదవడం కుదరదు. ప్రిలిమ్స్ లో అర్హత పొందుతున్నారు అంటే మీరు సబ్జెక్టు ఒక సారి చదివి ఉంటారు. అందువల్ల ఇప్పుడు చదివేటప్పుడు ఆ సమయంకంటే తక్కువ పట్టేలా రివిజన్ చేయాలి మరియు వ్రాయడం మీద ఎక్కువగా గురి పెట్టాలి.కొత్త సబ్జెక్టు ఎక్కువ సేపు చదివి అది అయ్యాక తక్కువ సమయం లో రివిజన్ ముగించాలి.అప్పుడే ఇంత విస్తృత సిలబస్ పూర్తి చేయగలరు.
25,150 మంది లో మీరు ఎలా ప్రత్యేకం
ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన ప్రతీ విద్యార్థి ఎంతో కొంత విషయ పరిజ్ఞానం కలిగి ఉంటారు. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక జవాబు రాస్తారు. కానీవారి లో మీరు ఎలా ప్రత్యేకం. జవాబు లో విషయ వర్గీకరణ, వివిధ రకాల జవాబుల నిర్మాణం, వివరించండి, విశ్లేషించండి వంటి ప్రశ్నాపదాలకి తగ్గట్టు జవాబు నిర్మాణం, తెలంగాణాకు సంబంధించిన అంశాలు జోడించడం, కరెంట్అఫైర్స్ ను మీ జవాబులలో అవసరమైన చోట అంతర్లీనంగా వ్యక్తపరచడం వంటివి చేస్తేనే మీరు ఇతరుల కంటే ముందు వరుస లో ఉంటారు. ఇది ప్రతీ రోజు ప్రణాళికాబద్ధం గా విషయానుసారం సాధన చేస్తేనే అలవాటు అవుతుంది
ప్రిపరేషన్ యందు సవాళ్ళు-సమాధానాలు
తెలుగు పుస్తకాల లభ్యత అన్నిటికంటే పెద్ద సమస్య లా తెలుగు మాధ్యమం వారికి అనిపిస్తుంది. కానీ అది సరికాదు. ఇంగ్లీష్ మాధ్యమం వారికి వివిధ రకాల ధృక్పధాలతో పుస్తకాల లభ్యత వాస్తవమే కానీ విజయానికి వివధ రకాల పుస్తకాల కంటే ఒకే పుస్తకం పలు సార్లు రివిజన్ చేసి పట్టు సాధించడం మీదే ఉంటుంది. ధృక్పధం ఎప్పుడైన కొత్త గా ఉంటేనే మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. కావున తెలుగు మధ్యమం వారు ఒకే పుస్తకం ఎక్కువ సార్లు చదవడానికి ప్రయత్నిస్తూ కరెంట్ అఫ్ఫైర్స్ మీద అవగాహన పెంచుకుంటే విజయం లభించే అవకాశాలు ఎక్కువ
మరొక ముఖ్య సమస్య ఎక్కువ ప్రశ్నలకు జవాబులు రాయలేకపోవడం. ఇది సమయ నిబంధన పెట్టుకుని రోజూ సాధన చేస్తేనే అవుతుంది. ఒక ప్రశ్న రాసేటప్పుడు దాని నిర్మాణం ముందుగానే మెదడు లో ఏర్పరుచుకుని అన్ని అంశాలు స్మృశించే విధంగా సాధన చేయాలి. అప్పుడు మొదట్లో రాసే ప్రశ్నలే కాదు అన్ని ప్రశ్నలు అడిగిన విధంగా రాయగలరు.
మరొక జఠిల సమస్య తెలంగాణ కరెంట్అఫైర్స్ ఏ విధంగా సమకూర్చుకోవాలి. దీనికి రోజు వారీ పేపర్ చదవడం మరియు నోట్స్ రాసుకోవడం మంచిది. రోజు వారీ పేపర్ చదివితే సంపాదకీయం మరియు వ్యాసాలలో రాసే విశ్లేషనాంశాలు ఉపయోగపడతాయి
కలెక్టర్ స్థాయి అధికారి ఆలోచనా విధానం ప్రణాళికా పద్ధతులు అలవారుచుకోవాల్సిన అవసరం విద్యార్థులలో ఉంది. వివేకానందుని మాటలలో వెయ్యి అడుగులు కూడా ఒక్క అడుగు తోనే మొదలవుతుంది అనేది ఆచరణలో పెట్టి నేటి నుంచైనా మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. విద్యార్థి తన యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎంతో విలువైన అవకాశాన్ని రెండూ చేతులతో అందుకుని స్థిరత్వం
మరియు పట్టుదల తో ఈ గ్రూప్ –I లో విజయవంతం కావాలని మరియు మీరు అలవరుచుకున్న క్రమశిక్షణ జీవితాంతం మీరు కొనసాగించి మంచివ్యక్తిగా నిలవాలని ఆకాంక్ష
Join Telegram
Join CivicCentre IAS Academy Telegram Channel for Daily Current Affairs